22A Lands: హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ధరణి, భూ భారతి, 22ఏ సృష్టించిన సమస్యలపై.. చర్చిద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పరిష్కార మార్గాలు చూపుదాం పేరుతో ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భూ నిపుణులు, రిటైర్డ్ ఆఫీసర్లు, 30 మంది వరకు భూ బాధితులు పాల్గొన్నారు. ధరణి, భూ భారతి, 22ఏ భూ బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమ భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ సర్కార్ పై నిపుణులు ధ్వజమెత్తారు. చట్టాల మాటున భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా పాలన అంటూనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
రిటైర్డ్ కలెక్టర్ (మేడ్చల్) ఎంవీ రెడ్డి, దొంతు నర్సింహారెడ్డి, సాదిక్, రాంబాబు (రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్), రఫీ (ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మెంబర్), సురేశ్ రెడ్డి (రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్), బాలరాజు (రిటైర్డ్ తహశీల్దార్), సురేందర్ రెడ్డి (రిటైర్డ్ ఆర్మీ జవాన్), తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయి, కె.కృష్ణారెడ్డి, స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఈ సమావేశంలో పాల్గొన్నారు.
హక్కులు నిర్ణయించడానికి వ్యవస్థ కావాలి- రాంబాబు, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్
గ్లోబలైజేషన్ అయినప్పటి నుంచి, డెవలప్ మెంట్ అయినప్పటి నుంచి భూమి కమర్షియల్ వస్తువుగా చేతులు మారుతోంది. హక్కులు నిర్ణయించడానికి వ్యవస్థ లేదు. సర్వేకి, హక్కులకి లింకు లేకుండా జరగటం వల్ల వచ్చిన సమస్యలు ఇవి. కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్, రెవెన్యూలో ఉన్న ల్యాండ్ వింగ్, సర్వే వింగ్ ఇవన్నీ కలిసి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఒక గొడుగు కిందకు తెచ్చి ఈ ప్రత్యేక సమస్యలు అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సమస్యలు మాత్రమే చేస్తే అప్పుడు పరిష్కారం అవుతుంది. ప్రజల ఇన్వాల్వ్ మెంట్ లేకుండా, మన ఓనర్స్ కు తెలియకుండా ఏ రికార్డు మార్చినా అది క్రైమ్ అని చట్టంలో ప్రత్యేక అంశాన్ని చేరిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. జాయింట్ యాక్షన్ కమిటీ గురించి ఆలోచించి ఈ సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ప్రారంభం కావాలని కోరుకుంటున్నా.
డిజిటల్ రికార్డ్‌ను చాలా సులభంగా మాన్యుపులేట్ చేయొచ్చు- దుంతి నర్సింహారెడ్డి
భూమి సహజ వనరు. కానీ కాలానుగుణంగా పెట్టుబడి వస్తువుగా మార్చబడింది. 1999లో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. ల్యాండ్ మార్కెట్ క్రియేట్ చేయాలని ప్రపంచ బ్యాంకు ఆనాటి నుంచి చెబుతోంది. అది క్రమంగా అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా సరే.. వాటిని అమలు చేసే ప్రక్రియలు అనేకం చేపట్టాయి.
భూమి సహజ వనరు కాదు.. దాన్నొక పెట్టుబడి వస్తువుగా మార్చండి. దాని వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని ప్రపంచ బ్యాంకు చెప్పింది. ఎన్టీఆర్ పట్వారీ వ్యవస్థను ఎత్తివేశారు. ఎన్టీఆర్ కు ముందు భూపరిపాలన ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ చంద్రబాబు కాలం మధ్య ఒక అధ్యాయం. చంద్రబాబు టైమ్ లో కంప్యూటరైజేషన్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. ఇది భూ సమస్యలను మరింత తీవ్రతరం చేసింది. ప్రత్యేకంగా తెలంగాణలో.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక డిజిటల్ నినాదం ఎత్తుకున్నారు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు.. కేంద్రంలోని యూపీఏ ఆ తర్వాత ఎన్డీయే అన్ని ప్రభుత్వాలది అదే బాట. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందో అదే అమలు చేస్తున్నారు. ధరణి చట్టం తెచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. భూ భారతిలో మాత్రం ప్రజలతో సంప్రదింపులు అయినా జరిపింది. పాత చట్టానికి ఒకటే లైన్ మార్చి డిజిటల్ రికార్డ్స్ ఉంటాయని చెప్పారు. రెండు మూడు పదాలు పెట్టి ధరణి చట్టం తెచ్చారు.
మేము మొదటి నుంచి కూడా డిజిటలైజేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. డిజిటల్ రికార్డులను ఇష్టారీతిన మార్చేశారు. ఇవాళ చాలా గందరగోళం ఉంది. మళ్లీ చీకటి వ్యవస్థనే మనం ఆశ్రయించాల్సిన అవసరాన్ని కల్పిస్తున్నారు. డిజిటల్ రికార్డ్ ను చాలా సులభంగా మాన్యుపులేట్ చేయొచ్చు.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తెస్తున్నామని రేవంత్ ప్రభుత్వం చెప్పింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో సాఫ్ట్ వేర్ లో ప్యాకెట్స్ గా చేస్తారు. ఒక రిజిస్ట్రేషన్ అయ్యాక మన రికార్డ్ ఒక ప్యాకెట్ లో కూర్చుంటుంది. దాన్ని మార్చాలంటే ఒక డెసిషన్ మేకింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. అదంతా అయ్యాకే అది మారుతుంది. అది బ్లాక్ చెయిన్ టెక్నాలజీ. కానీ అది వాడలేదు.
ధరణి, భూ భారతి ఒక్కటే.. రెండింటికి డ్రాఫ్ట్ చేసింది ఒక్కరే- బాలరాజు,రిటైర్డ్ ఎమ్మార్వో
ధరణి, భూ భారతి ఒక్కటే. ఈ రెండు చట్టాలను డ్రాఫ్ట్ చేసింది ఒక్కరే. ఏమీ మార్పు లేదు. ఇప్పుడు ధరణి, భూ భారతికి మించిన భూతం వచ్చింది. అదే 22ఏ. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 2004లో ప్రతి మండలానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములు ఎవరికీ అసైన్ చేయకుండా రాసి పెట్టుకున్నారు. అవసరానికి వాడుకుందాం అని అనుకున్నారు. అంటే స్కూల్ కో, ఆసుపత్రికో వాడుకోవచ్చు అని రాసి పెట్టారు. అదే నిషేధిత జాబితా. అంటే.. అమ్మడం, కొనుగోలు నిషేధించడం కోసం తయారు చేయబడిన లిస్ట్.
మర్డర్, రేప్ చేసి సారీ చెబితే సరిపోతుందా? పొంగులేటికి బుద్ధుందా? రఫీ-ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మెంబర్
మనం అమాయకంగా ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే. భూమికి భద్రత ఇవ్వలేని ప్రభుత్వాలు మనకు అవసరమా? ప్రజలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ప్రజాపాలన అని పేరు పెట్టి మీరు ఇచ్చేది మానసిక క్షోభనా? ఒక అభద్రత భావం కల్పిస్తారా? ప్రభుత్వానికి మొత్తం తెలుసు.
తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 12ఏళ్ల నుంచి ఎమ్మార్వో ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ప్రజలు గడిపారు. ధరణి వల్ల సమస్యలు వచ్చాయని చెబితే కొత్త ప్రభుత్వం వచ్చి భూ భారతి తెచ్చింది. ఒక భూమికి యజమానిని, ఒక ఇంటికి యజమానిని మీరు యజమాని కాదని నోటీసులు ఇస్తే వారి పరిస్థితి ఏంటి?
హైడ్రా, మూసీ, 22ఏ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు
అటు హైడ్రా అని ఇటు మూసీ అని ఇవాళ 22ఏ పేరుతో ప్రజలను పరేషాన్ చేస్తున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి ప్రజలకు పరేషాన్ తప్ప ప్రజలకు భద్రత ఇవ్వలేదు. ఇలాంటి ప్రభుత్వం ఎందుకు? సారీ చెబితే సరిపోతుందా. మర్డర్, రేప్ చేసి సారీ చెబితే సరిపోతుందా. ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది? సారీ కాదు రాజీనామా చేయాలి. తప్పు చేసిన ఆ ఆఫీసర్లను తొలగించాలి. ఇలాంటి తప్పులు మరోసారి రిపీట్ అవకుండా ఉండాలంటే తప్పు చేసిన వారందరిని తొలగించాలి.
ముఖ్యమంత్రి భూమి కూడా 22ఏ కింద వచ్చిందని చెబుతున్నారు. కానీ అది ఉత్తిదే. దీన్ని ఒక సాకుగా చూపి.. పొరపాటు జరిగింది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే నిజం బయటపడింది. ఎందుకు, ఎవరి కోసం ఈ ట్రిక్కులు? పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. న్యాయమైన నీ టైటిల్ ఉన్నా నువ్వు లంచం ఇవ్వనిదే అధికారి సంతకం చేయడు. మన భూమికి మనమే లంచం ఇచ్చుకుంటే తప్ప అది మ్యుటేషన్ కావడం లేదు.
22ఏ అనేది ఒక కుట్ర. అది తప్పు కాదు. కావాలనే చేసింది. పౌర సమాజం జాగృతం కావాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. 22ఏ నోటీసులన్నీ రద్దు చేసేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి బకరాలు కావొద్దు. టోల్ ఫ్రీ నెంబర్ ఒప్పుకోము. ఓనర్ షిప్ కంటిన్యూ కావాలి'' అని తెలంగాణ సమాఖ్య ఆర్గనైజర్ డిమాండ్ చేశారు.
ప్రజలు మేల్కోవాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి
''మొన్న ధరణి, నిన్న భూ భారతి, ఇప్పుడు 22ఏ పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోంది. భూములు కొల్లగొడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలంతా ఏకం కావాలి. జెన్ జెడ్, రైతులు, ప్రజలు బయటకు రావాలి. అన్యాయాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. లేదంటే ఈ భూ దందాలు ఆగవు.











