Telangana High Court: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలకు ప్రజా ధనం వృథా చేస్తే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. అసలు చట్టబద్ధత లేని స్కీమ్ లకు ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని రేవంత్ సర్కార్ ను కోర్టు అడిగింది. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తెచ్చి ఆ డబ్బును ఉచిత పథకాలకు ఖర్చు చేయొచ్చు కదా అని న్యాయస్థానం అభిప్రాయపడింది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. బడ్జెట్ లో కేటాయింపుల ప్రకారం ఈ పథకాలకు డబ్బులు ఇస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకి తెలిపింది. పేద యువతుల వివాహం కోసం ప్రభుత్వం ఈ నిధులు కేటాయిస్తున్నట్ల వివరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ధనాన్ని ఉచిత పథకాలకు ఖర్చు చేస్తే ఎలా? అని సర్కార్ ను ప్రశ్నించింది. భూ సేకరణలో డబ్బులు రాలేదంటూ చాలామంది కోర్టులను ఆశ్రయిస్తున్నారని ప్రభుత్వానికి తెలిపింది. ఇక కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ వినతిని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఉచిత పథకాలకు ప్రజా ధనం వృథా చేస్తే ఎలా అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోర్టు వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. న్యాయస్థానం చేసిన కామెంట్స్ ను కొందరు ఆహ్వానిస్తున్నారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాకుండా అన్ని ప్రభుత్వాల తీరు ఇదే విధంగా ఉందని.. ఉచిత పథకాల పేరుతో ప్రజా ధనం వృథా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. స్కీమ్స్ కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేయడం సమంజసం కాదంటున్నారు. కోర్టు వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని, ప్రజా ధనం వృథాకు అడ్డుకట్ట పడాలని ఆశిస్తున్నారు.











