44 Votes: తెలంగాణలో ఇటీవల చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో లోపాలు బయటపడుతున్నాయి. ఎస్ఐఆర్ చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత ఓట్లలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఒకే ఇంటి చిరునామాతో ఎస్ఐఆర్ కు ముందు 19 ఓట్లు.. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓట్ల సంఖ్య 44కి పెరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఈ ఘటన జరిగింది. అక్కడ G ప్లస్ 2 ఆఫీస్ బిల్డింగ్ చిరునామాతో 44 ఓట్లు తేలాయి. దీంతో రాజకీయ పార్టీల కార్యకర్తలు అవాక్కవుతున్నారు.
ఆ ఇంట్లో కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ ఆఫీస్ మాత్రమే నడుస్తుందని.. 44 మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని అంతా షాక్ అవుతున్నారు. వేరే చోట్ల నివాసం ఉంటున్న వారు ఈ ఆఫీస్ చిరునామాతో ఎస్ఐఆర్ దరఖాస్తు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ కంటే ముందు పాత ఓటర్ జాబితాలో ఈ ఇంట్లో కేవలం 19 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
ఎలాంటి పరిశీలన లేకుండా ఒకే ఇంటి నెంబర్ మీద 44 ఓట్లను ముసాయిదాలో చేర్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే చిరునామాలో 43 మంది పురుష ఓటర్లు కాగా, ఒక మహిళా ఓటర్ ఉన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఎన్నికల సంఘం అధికారులను రాజకీయ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఒకే ఇంట్లో 44 ఓట్ల వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్..
ఒకే ఇంట్లో 44 ఓట్ల వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆఫీసు చిరునామాతో ఒకే ఇంట్లో 44 ఓట్ల వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని ఖైరతాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి ఈసీ ఆదేశించింది.
ఎన్నికల సంఘం ఆదేశాలతో సిబ్బంది రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే కాలనీలో స్వచ్ఛంద సంస్థ కార్యాలయం వద్ద విచారణ చేపట్టారు. ఓటర్ల ఆధార్ కార్డులు, 2002 జాబితాలో మ్యాపింగ్, పాత ఓటర్ జాబితాను ఎన్నికల సిబ్బంది పరిశీలిస్తున్నారు. కాగా.. వివిధ ప్రాంతాలకు చెందిన ఓటర్లు ఒకే ఇంటి చిరునామాలో నమోదు చేసుకున్నారని.. గత ఎన్నికల్లో వీరిలో సగం మంది మాత్రమే ఓటర్ జాబితాలో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేసినా.. బోగస్ ఓట్ల వ్యవహారంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కాలనీలో 44 ఓట్ల వ్యవహారంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చింది.











