Principal Roopa Reddy: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసులో షాకింగ్ నిజాలను పోలీసులు వెల్లడించారు. ప్రిన్సిపాల్ రూపారెడ్డిని చంపింది ఆమె స్కూల్ లోనే పదో తరగతి చదువుతున్న విద్యార్థులే అని పోలీసులు నిర్ధారించారు. డబ్బు కోసమే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ కేసు వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు తెలియజేశారు.
70 సీసీ కెమెరాలు జల్లెడ.. టెక్నాలజీ మొత్తం వినియోగం
కొండమల్లేపల్లి జేబీ కాలనీలో ఈ నెల 11న సాయంత్రం రూపారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆమె స్కూల్ లో చదివే ఇద్దరు పదో తరగతి విద్యార్థులే హంతకులుగా పోలీసులు నిర్ధారించారు. సవాల్ గా మారిన ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. 70 సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. 80 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్, కాల్ డేటా, టవర్ లొకేషన్ ఇలా టెక్నాలజీ మొత్తం వాడారు పోలీసులు. అన్ని కోణాల విచారణ తర్వాత విద్యార్ధులపై వారి చూపు పడింది.
బాబు.. ఆ పదమే హంతకులను పట్టించింది
స్కూల్ పిల్లలను రూపారెడ్డి బాబు అని సంబోధిస్తారనే సమాచారం సేకరించారు పోలీసులు. ప్రిన్సిపాల్ రూపారెడ్డి తన చివరి ఫోన్ కాల్ లో మాట్లాడుతూ బాబు అన్న పదం ఆధారంగా పోలీసులు నిందితులను ట్రేసవుట్ చేశారు. చివరగా రూపారెడ్డి తన చిన్నమ్మతో కాల్ మాట్లాడే సమయంలో బాబూ అని అన్నారు. అదే చివరి వాయిస్. ఆ కోణంలో విచారించేసరికి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
ప్రిన్సిపాల్ హత్య కేసులో ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పిన సంచలన నిజాలు..
చెడు వ్యసనాలకు బానిసలయ్యారు.. ఈజీ మనీకి అలవాటు పడ్డారు
16ఏళ్ల ఇద్దరు విద్యార్ధులు హాస్టల్ లో ఉంటూ నాగార్జున గ్రామర్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్నారు. ఆ ఇద్దరు చెడు వ్యవసనాలకు బానిసగా మారారు. ఈజీ మనీకి అలవాటు పడ్డారు. హాస్టల్ లో రహస్యంగా మొబైల్ వాడుతున్నారు. మొబైల్ లో తేలికగా డబ్బులు ఎలా సంపాదించాలి అనే వీడియోలు సెర్చ్ చేస్తూ ఉండేవారు. ఒకరోజు డబ్బులతో విద్యార్థులు ప్రిన్సిపాల్ రూపారెడ్డికి దొరికారు. తల్లిదండ్రుల సమక్షంలో ఆ ఇద్దరు విద్యార్ధులకు ప్రిన్సిపాల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పుడే రూపారెడ్డిపై విద్యార్ధులు కక్ష పెంచుకున్నారు. రూపారెడ్డి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని గ్రహించారు. ఆ డబ్బుపై కన్నేశారు.
చోరీ ఎలా చేయాలో, అడ్డొస్తే ఎలా హత్య చేయాలో యూట్యూబ్ లో వెదికారు
చోరీ ఎలా చేయాలో, అడ్డొస్తే ఎలా హత్య చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేశారు. పధకం అమలు చేశారు. ముందుగా కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు, మాస్కులు కొనుగోలు చేశారు. ఇద్దరు విద్యార్థులు రూపారెడ్డి ఇంట్లో చోరీకి వెళ్లారు. ఆగస్టు 11వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో గోడ దూకి కిచెన్ నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు ఓ విద్యార్థి. మరో విద్యార్ది బయట కాపలా ఉన్నాడు. ప్రతిఘటించిన రూపారెడ్డిపై ఒకడు కత్తితో ఎటాక్ చేశాడు. కడుపులో 27 పోట్లు పొడిచాడు.
దొంగిలించిన డబ్బుతో స్కూల్ కి రాకుండా జల్సాలు
అనంతరం ఆమె వద్ద ఉన్న రూ.2.50 లక్షల నగదు, ఐ ఫోన్ తో ఉడాయించారు. హత్య చేసిన తర్వాత గ్లౌజులను, కత్తిని చెట్ల పొదల్లో పడేశారు. బట్టలు కూడా అక్కడే వదిలేశారు. దొంగిలించిన డబ్బుతో స్కూల్ కు రాకుండా జల్సాలు చేయడం మొదలెట్టారు. పెండ్లిపాకల నుంచి మల్లేపల్లికి వస్తున్న క్రమంలో ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. మూడు నోట్లకు రక్తపు మరకలు కనిపించాయి. అదుపులోకి తీసుకుని విచారిస్తే రూపారెడ్డిని హత్య చేసిన విషయాన్ని, హత్యకు గల కారణాన్ని చెప్పారు. వారి నుంచి రూ 1.56 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నాం. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నాం'' అని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.











