Krishna Basin: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా నిలిచిన ప్రవాహం ప్రస్తుతం ఆశాజనకంగా మారింది. సిడబ్ల్యూసి అంచనాల మేరకు హిప్పర్గికి 62వేల క్యూసెక్కులు, ఆల్మట్టికి 60వేల క్యూసెక్కులు, నారాయణపూర్ కు 58వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎగువ ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీరు చేరడంతో నిల్వ సామర్థ్యం దాదాపు నిండింది. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రానుంది.
నారాయణపూర్ గేట్లు ఎత్తివేత.. జూరాలకు భారీ వరద
నారాయణపూర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి జలాశయంలోకి 57 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 492.25 మీటర్లు. ప్రస్తుతం 492.15 మీటర్లకు చేరింది. 12 స్పిల్ వే గేట్లు, జల విద్యుత్ కేంద్రం ద్వారా 47760 క్యూసెక్కులు, కాలువలకు 8000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం 33.313 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 32.843 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
జూరాల 6 గేట్లు ఎత్తివేత
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వర ప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 58వేల క్యూసెక్కులు వస్తుండడంతో అధికారులు 6 గేట్లను ఎత్తి శ్రీశైలంకు నీటిని వదులుతున్నారు. పవర్ హౌస్, స్పిల్ వే ద్వారా కలిపి మొత్తం 71,292 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 9.357 టీఎంసీలకు చేరడంతో జలాశయం పూర్తిగా నిండింది.











