National

Bihar: ప్రభుత్వ స్కూల్‌లో కలకలం.. 36 మంది విద్యార్థులకు అస్వస్థత!..

రచన: Venu19, ఆగ 20264 నిమిషాల పఠనం

పలువురు విద్యార్థులకు భోజనం చేసిన కొద్దిసేపటికే తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారికి ప్రథమ చికిత్స అందించారు. అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో 36 మంది విద్యార్థులను నలంద సదర్ ఆసుపత్రికి తరలించారు.

మధ్యాహ్న భోజన పథకం పేద విద్యార్థుల పాలిట వరంగా మారింది. కానీ ఈ పథకం అమలులో ఎన్నో ఆటంకాలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి శాపంగా కూడా మారిందని వెలుగులోకి వస్తున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇక తాజాగా బిహార్‌లోని నలంద జిల్లాలో మిడ్ డే మీల్ విషయంలో జరిగిన ఓ చిన్న పొరపాటు తీవ్ర కలకలానికి దారితీసింది. ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ పౌడర్ ఆహారంలో కలవడంతో ఏకంగా 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

ఈ షాకింగ్ ఘటన నూర్ సరే పోలీస్ స్టేషన్ పరిధిలోని పరసి ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో చోటుచేసుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థుల కోసం నిర్దేశించిన మెనూ ప్రకారం సోయాబీన్ అన్నంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ఓ ఎన్జీవో సరఫరా చేసింది. అయితే భోజనంలో ఉప్పు తక్కువగా ఉందని కొందరు విద్యార్థులు చెప్పడంతో.. ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ పౌడర్‌ను ఆహారంలో కలిపారు.

అయితే వంటగదిలో ఉప్పు, డిటర్జెంట్ పౌడర్ డబ్బాలు ఒకే చోట ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు పలువురు విద్యార్థులకు భోజనం చేసిన కొద్దిసేపటికే తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారికి ప్రథమ చికిత్స అందించారు. అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో 36 మంది విద్యార్థులను నలంద సదర్ ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న సివిల్ సర్జన్ డాక్టర్ జయ ప్రకాష్ సింగ్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం పిల్లలందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. మరోవైపు బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ కూడా ఆసుపత్రిని సందర్శించి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మిడ్ డే మీల్ తయారీ నుంచి విద్యార్థులకు వడ్డించే వరకు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునేందుకు సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో మరింత అప్రమత్తత అవసరమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

#Bihar#Nalanda#Mid Day Meal#Detergent Powder#School Students#Sick#NGO Food
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తర్వాత చదవండి