2029 ఎన్నికలకు కాంగ్రెస్ మాస్టర్‌ప్లాన్
800 నగరాల్లో చత్రోంకీ గూంజ్
విద్యార్థులు, యూత్ ఓట్లే టార్గెట్
CWC సమావేశంలో కీలక నిర్ణయాలు
దేశ రాజకీయాల్లో మరోసారి యువత, పేపర్ లీకులు, నిరుద్యోగం ప్రధాన రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ భారీ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. తాజాగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే.. కాంగ్రెస్ ఇక కేవలం ఢిల్లీ వేదికగా విమర్శలు చేయడం కాకుండా విద్యార్థులు, యువత ఉన్న ప్రతి ప్రాంతానికి వెళ్లి ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా కీలక వ్యూహాలను ఖరారు చేసింది.
‘చత్రోం కి గూంజ్’.. ఇక 800 నగరాల్లో!
కాంగ్రెస్ ఇప్పటికే ప్రారంభించిన ‘Chhatron Ki Goonj’ కార్యక్రమాన్ని ఇప్పుడు మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. దేశంలోని దాదాపు 800 నగరాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని CWC నిర్ణయించింది. పరీక్షలలో అక్రమాలు, పేపర్ లీకులు, పరీక్షల రద్దు, రీ-ఎగ్జామ్స్, విద్యా ఖర్చులు, నియామకాలలో జాప్యం వంటి అంశాలను విద్యార్థులు, యువత సమస్యలుగా కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లనుంది.
ఇక్కడే అసలు రాజకీయ లెక్క మొదలవుతోంది. దేశంలో యువ ఓటర్లు సంఖ్య భారీగా ఉంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు పరీక్షల విషయంలో జరిగే ప్రతి చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగానే కనిపిస్తుంది. ఒక పరీక్ష రద్దయినా, పేపర్ లీక్ అయినా.. నెలలు, సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులపై దాని ప్రభావం పడుతుంది. అందుకే పేపర్ లీక్ అంశాన్ని కేవలం విద్యా సమస్యగా కాకుండా రాజకీయ సమస్యగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
యువతనే ఎందుకు టార్గెట్ చేస్తోంది?
కాంగ్రెస్ తాజా వ్యూహంలో యువతకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు, పరీక్షలు, విద్య వంటి అంశాలు నేరుగా యువ ఓటర్ల జీవితాలతో ముడిపడి ఉండటమే. దేశంలో చదువుకున్న యువతలో నిరుద్యోగ పరిస్థితిపై కూడా CWC ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది.
ఇప్పటివరకు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధరలు, నిరుద్యోగం, రైతులు, రాజ్యాంగం వంటి అనేక అంశాలపై పోరాటాలు చేశాయి. కానీ కాంగ్రెస్ ఇప్పుడు “నీ చదువు.. నీ పరీక్ష.. నీ ఉద్యోగం” అనే వ్యక్తిగత కనెక్షన్‌తో యువతను చేరుకోవాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఒకవేళ ఈ ప్రచారం విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో బలమైన స్పందన తెస్తే.. అది క్రమంగా రాజకీయ చర్చగా మారే అవకాశం ఉంటుంది.
రాహుల్ గాంధీతో మరింత దూకుడు
ఈ ప్రచారంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. ‘Chhatron Ki Goonj’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారని కాంగ్రెస్ తెలిపింది. ఆగస్టు 22న పుణెలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అంటే కాంగ్రెస్ వ్యూహం కేవలం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకోవడం కాదు. విద్యార్థులతో నేరుగా మాట్లాడటం, వారి సమస్యలను వినడం, వాటిని జాతీయ రాజకీయ అంశాలుగా మార్చడం అనే దిశగా సాగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం కూడా ఈ కార్యక్రమానికి అదనపు బలం ఇవ్వొచ్చు.
పేపర్ లీక్‌తో పాటు ‘చందా చోరీ’ అస్త్రం
కాంగ్రెస్ వ్యూహం విద్యార్థుల సమస్యల దగ్గరే ఆగడం లేదు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విరాళాల వ్యవహారంపై కూడా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని CWC నిర్ణయించింది. కాంగ్రెస్ దీనిని చందా చోరీగా ప్రస్తావిస్తోంది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు, ఖాతాలు, ఆస్తుల ఆడిట్ వంటి డిమాండ్లను పార్టీ ముందుకు తెచ్చింది.
ఇక్కడ కాంగ్రెస్ మరో పొలిటికల్ స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. ఒకవైపు యువత,పేపర్ లీక్, ఉద్యోగాలు వంటి ప్రజల రోజువారీ సమస్యలను తీసుకుంటూనే.. మరోవైపు బీజేపీకి బలమైన భావోద్వేగ అంశంగా ఉన్న అయోధ్య రామ మందిరం చుట్టూ ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా రాజకీయ చర్చను విస్తరించాలని చూస్తోంది.
చైనా, డీలిమిటేషన్, E20.. ఒకేసారి ఇన్ని అస్త్రాలా?
పేపర్ లీకులు, రామ మందిర విరాళాల అంశాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా కార్యకలాపాలు, డీలిమిటేషన్, E20 ఇంధనం, మహిళా రిజర్వేషన్, వందేమాతరం వంటి అంశాలపైనా తన వైఖరిని ప్రకటించింది కాంగ్రెస్.
ఇవన్నీ చూస్తుంటే.. కాంగ్రెస్ ఒకే అంశంపై కాకుండా మల్టీ-ఫ్రంట్ పొలిటికల్ క్యాంపెయిన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒకే సమస్యపై కాకుండా.. యువత నుంచి విదేశాంగం వరకు, ఆర్థిక వ్యవహారాల నుంచి ఎన్నికల వ్యవస్థ వరకు వివిధ అంశాల్లో ప్రశ్నించే ప్రయత్నం చేస్తోంది.
BJPకి ఇబ్బందులు తప్పవా..?
ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. కాంగ్రెస్ 800 నగరాల్లో విద్యార్థుల కార్యక్రమాలు నిర్వహించినంత మాత్రాన అది వెంటనే ఓట్లుగా మారుతుందని చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం. యువత సమస్యలను నిరంతరం ప్రజా చర్చలో ఉంచగలిగితే.. కాంగ్రెస్‌కు రాజకీయంగా ఒక కొత్త స్పేస్ దొరికే అవకాశం ఉంది.
ప్రత్యేకంగా పేపర్ లీక్ లేదా పరీక్షల రద్దు వంటి అంశాలు జరిగినప్పుడు ప్రభావితమయ్యే విద్యార్థుల కుటుంబాలు కూడా ఆ సమస్యతో కనెక్ట్ అవుతాయి. అదే సమయంలో ప్రభుత్వం ఈ ఆరోపణలకు సమర్థవంతమైన సమాధానాలు ఇవ్వగలిగితే.. కాంగ్రెస్ ప్రచారం అంత ప్రభావం చూపకపోవచ్చు.
అందుకే ఇది కేవలం కాంగ్రెస్ కార్యక్రమం కాదు.. వచ్చే రోజుల్లో యువత ఓటు బ్యాంకును ఎవరు ప్రభావితం చేస్తారనే దానిపై జరగబోయే పెద్ద రాజకీయ పోరాటానికి ప్రారంభ సంకేతం. ఒకవైపు ‘చత్రోం కి గూంజ్’తో 800 నగరాల్లో విద్యార్థుల గళం.. మరోవైపు ‘చందా చోరీ’తో గ్రామస్థాయి ఉద్యమం.. మధ్యలో నిరుద్యోగం, పేపర్ లీకులు, చైనా, డీలిమిటేషన్ వంటి అంశాలు. కాంగ్రెస్ తాజా వ్యూహం చూస్తుంటే.. మోదీ ప్రభుత్వంపై మరోసారి ఆల్‌రౌండ్ పొలిటికల్ అటాక్ మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది.











