రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనంచేస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన 'శక్తి' స్కీమ్, జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలు ఉధృతమవుతున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యావ్యవస్థ ప్రాధాన్యతను తగ్గించి, తమను కేవలం శ్రామిక శిక్షణ (లేబర్)కే పరిమితం చేసేలా ఈ నిర్ణయం ఉందంటూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో-97ను రద్దు చేయకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని రామంతాపూర్, సంగీత్ చౌరస్తా, ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతాల్లో పాలిటెక్నిక్ విద్యార్థినులు, విద్యార్థులు రహదారులపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సంగీత్ చౌరస్తా వద్ద రహదారిపై బైఠాయించడంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంజినీరింగ్‌లోకి లాటరల్ ఎంట్రీ పొందే అవకాశాలను దెబ్బతీస్తూ, తమ మూడేళ్ల కష్టాన్ని వృథా చేసేలా ఉన్న ఈ స్కీమ్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. రాజధానితో పాటు జిల్లాల్లోనూ విద్యార్థుల ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల సాంకేతిక విద్యా మండలి (SBTET) స్వతంత్రత దెబ్బతింటుందని, తమ భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ ప్రైవేటీకరణకు దారితీస్తుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలకు కావాల్సిన మౌలిక వసతులు, ప్రయోగశాలలు కల్పించి పోస్టులను భర్తీ చేయాల్సింది పోయి, డిప్లొమా స్థాయిని తగ్గించేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని జీవో-97ను ఉపసంహరించుకునే వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు విశ్రమించేది లేదని హెచ్చరించారు.











